బంగారం వ్యాపారుల బరితెగింపు షాపులో అరగంట వరకు విలేకరిని నిర్భందం..

🔴 బంగారం వ్యాపారుల బరితెగింపు

🟣 షాపులో అరగంట వరకు విలేకరిని నిర్భందం..

🟣 ఫొటోలు ఎలా తీస్తామని బెదిరింపులు

🟣 పోలీసులకు ఫిర్యాదు చేసిన రిపోర్టర్

వికారాబాద్ జిల్లా తాండూర్ లో  బంగారం వ్యాపారులు బరితెగించారు. ఓ పత్రికలో పనిచేస్తున్న విలేకరిని వారి షాపులో నిర్బంధానికి గురిచేశారు. ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాండూరులో స్వర్ణకారుల సంఘం, జువేల్లరీ వ్యాపారుల యూనియన్ల ఆధ్వర్యంలో బంగారం స్వఛ్ఛత(ప్యూరిటీ టెస్ట్) పరిక్షలు నిర్వహించే షాపులు కొనసాగుతున్నాయి.

ఈ దుకాణాలను ప్రధాన రోడ్ల మార్గంలో కాకుండా షాఫింగ్‌ కాంప్లెక్స్‌ల్లోని లోపలి భాగంలో గుట్టుగా నిర్వహిస్తున్నారు. ఈ దుకాణాల నిర్వహణకు అనుమతులు సక్రమంగా లేవని, ఇందులో మోసాలు జరుగుతున్నాయని తెలిసి ఓ పత్రికలో పనిచేస్తున్న విలేకరి కొత్తపేట మహేష్‌ శుక్రవారం ఉదయం దుకాణాలకు సంబంధించిన ఫోటోలను తీసుకున్నారు.

అజయ్ అనే ఓ షాపుకు సంబంధించిన నిర్వహకుడు విలేకరిని అడ్డుకుని ఫోటోలు డిలీట్ చేయాలని ఒత్తిడికి గురిచేశాడు. అక్కడితో ఆగకుండా యూనియన్ నేతల వద్దకు రావాలని వెంట తీసుకెళ్లారు. పట్టణంలోని తమ్మణ్ణ, జువేల్లర్ వ్యాపారి శెట్టి రమేష్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వ్యాపారి శెట్టి రమేష్ కూడా విలేకరి మహేష్‌పై విరుచుకుపడ్డారు. ఫోటోలు ఎలా తీస్తావని, నీకేం అధికారం ఉందని అంటూ ఊగిపోయారు.

మాట్లాడేందుకు ఇచ్చిన ఫోన్‌ను తన వద్దే ఉంచుకుని దౌర్జన్యంగా అందులో తీసిన ఫోటోలను డిలీట్ చేశారు. ఫోటోలు ఎందుకు తీశారు, ఎవరు తీయమన్నారు..? వాళ్లు ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలంటూ విలేకరి మహేష్‌ను నిర్బంధించారు.

దాదాపు అరగంటకు పైగా షాపులోనే నిర్బంధం చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో బయటకు రావడంతో వ్యాపారులు పోలీస్టేషన్‌ వద్దకు వెళ్లారు. బాధిత విలేకరి మహేష్‌ కూడా పోలీస్టేషన్‌కు వెళ్లి తనను నిర్బంధించిన వ్యాపారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు,

తన వృత్తిని అగౌరవ పరిచే విధంగా వ్యవహరించడంతో పాటు మనోభావాలు దెబ్బతీసేవిధంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన తాండూరులో చర్చనీయాశంగా మారింది.