🔴 తాండూరులో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న వాటర్ ఫిల్టర్లు.. నీటి వృథాపై ప్రజల్లో ఆందోళన
ఒక లీటర్ శుద్ధి చేసిన నీటికి పది లీటర్ల నీరు వృథా.. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని ప్రజల విజ్ఞప్తి
నిజ స్వరూపం తాండూర్ ప్రతినిధి ::
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో రోజురోజుకూ వాటర్ ఫిల్టర్ కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ప్రజలకు శుద్ధి చేసిన తాగునీటిని అందించే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ వాటర్ ఫిల్టర్ కేంద్రాల వల్ల మరోవైపు భారీగా నీరు వృథా అవుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వాటర్ ఫిల్టర్లలో నీటిని శుద్ధి చేసే ప్రక్రియలో పెద్ద మొత్తంలో నీరు వృథాగా బయటకు వెళ్తుండటం పర్యావరణం, భూగర్భ జలాల పరిరక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
సాధారణంగా ఒక లీటర్ శుద్ధి చేసిన తాగునీటిని తయారు చేయడానికి సుమారు పది లీటర్ల వరకు నీరు వృథా అవుతోందని ప్రజలు పేర్కొంటున్నారు. ఇలా ప్రతిరోజూ వేల లీటర్ల నీరు వృథాగా డ్రైనేజీల్లోకి లేదా బయట ప్రాంతాల్లోకి వెళ్లిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తాండూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో నీటి సమస్యలు ఉన్న నేపథ్యంలో, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా తాండూరు పరిసర ప్రాంతాల్లో చెరువులు, ఇతర నీటి నిల్వ వనరులు తగినంతగా లేకపోవడంతో ప్రతి నీటి బొట్టును కాపాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో ప్రజలకు తాగునీటిని అందించే వాటర్ ఫిల్టర్ కేంద్రాల నుంచే పెద్ద మొత్తంలో నీరు వృథా కావడం ఆందోళన కలిగిస్తోంది. వ్యాపార నిర్వహణలో భాగంగా నీటిని శుద్ధి చేస్తున్న యాజమాన్యాలు, అదే సమయంలో నీటి పొదుపుపై కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు సూచిస్తున్నారు.
వాటర్ ఫిల్టర్ కేంద్రాల యాజమాన్యాలు నీరు వృథా కాకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఫిల్టర్ల నుంచి బయటకు వచ్చే నీటిని నేరుగా వృథా చేయకుండా ఇంకుడు గుంతల్లోకి మళ్లించడం ద్వారా భూమిలోకి నీరు ఇంకేలా చేయవచ్చని సూచిస్తున్నారు. తద్వారా భూగర్భ జలాల పెంపునకు కొంతమేర దోహదపడటంతో పాటు నీటి వృథాను కూడా తగ్గించవచ్చని అభిప్రాయపడుతున్నారు.
వాటర్ ఫిల్టర్ కేంద్రాల యాజమాన్యాలు సామాజిక బాధ్యతగా భావించి నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని, సంబంధిత అధికారులు కూడా ఈ అంశంపై దృష్టి సారించి తగిన సూచనలు, పర్యవేక్షణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
నీటిని వృథా చేయడం అంటే భవిష్యత్తు తరాల అవసరాలను ప్రమాదంలోకి నెట్టడమేనని, మున్సిపల్ చైర్ పర్సన్ నీరజబాల్ రెడ్డి. ప్రతి ఒక్కరూ నీటి పొదుపును బాధ్యతగా తీసుకోవాలని తాండూరు పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా వాటర్ ఫిల్టర్ కేంద్రాల యాజమాన్యాలు స్పందించి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి నీటి సంరక్షణకు సహకరించాలని మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్రెడ్డి కోరుతున్నారు.
