కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ఘనంగా మట్టి వినాయక విగ్రహాల తయారీ

వికారాబాద్ జిల్లా…

కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ఘనంగా మట్టి వినాయక విగ్రహాల తయారీ

తాండూరు: వినాయక చవితిని పురస్కరించుకుని తాండూరులోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో విద్యార్థులతో పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాల తయారీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మట్టి వినాయక విగ్రహాల ప్రాధాన్యత, పర్యావరణ పరిరక్షణపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (POP) విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా నీటి కాలుష్యాన్ని నివారించి ప్రకృతిని కాపాడవచ్చని వివరించారు. కార్యక్రమంలో భాగంగా తాండూరుకు చెందిన మట్టి విగ్రహాల కళాకారుడిని పాఠశాలకు ఆహ్వానించి, వినాయక విగ్రహాన్ని తయారు చేసే విధానాన్ని విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించారు. విద్యార్థులు ఉత్సాహంగా స్వయంగా మట్టి వినాయక విగ్రహాలను తయారు చేశారు.

అనంతరం విద్యార్థులు తాము తయారు చేసిన విగ్రహాలతో మంగళహారతులు, భక్తిగీతాలు, నృత్యాల మధ్య వినాయక ఆగమన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో పాఠశాల ప్రాంగణం భక్తిశ్రద్ధలు, పండుగ వాతావరణంతో కళకళలాడింది.

పాఠశాల చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గణపతి పూజ ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థుల భక్తిశ్రద్ధలు, సృజనాత్మకతను అభినందించారు. కరస్పాండెంట్ పట్లొల్ల సర్వోత్తం రెడ్డి మాట్లాడుతూ భక్తితో వినాయకుడిని ఆరాధించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

డైరెక్టర్ ద్యావరి జయవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మట్టి వినాయక విగ్రహాల తయారీ వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో పర్యావరణ స్పృహతో పాటు సృజనాత్మకతను పెంపొందిస్తాయని తెలిపారు. “మట్టి గణపతిని పూజిద్దాం – ప్రకృతిని కాపాడుదాం. భక్తితో పండుగ జరుపుకుందాం – బాధ్యతతో పర్యావరణాన్ని పరిరక్షిద్దాం” అనే సందేశాన్ని విద్యార్థులకు అందించారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎన్. రమేష్, సీనియర్ ఉపాధ్యాయులు పి. చంద్రశేఖర్ రెడ్డి, అనిల్ కుమార్, సునీతతో పాటు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.