గోట్లపల్లి గ్రామపంచాయతీలో నిధుల మళ్లింపుపై ఆరోపణలు

గోట్లపల్లి గ్రామపంచాయతీలో నిధుల మళ్లింపుపై ఆరోపణలు

పని చేసిన వ్యక్తికి కాకుండా మరో వ్యక్తికి చెల్లింపులు

వికారాబాద్ జిల్లా – పెద్దేముల్: పెద్దేముల్ మండలం గుట్లపల్లి గ్రామపంచాయతీలో వీధిదీపాల ఏర్పాటుకు సంబంధించిన నిధుల చెల్లింపులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. గ్రామపంచాయతీ తీర్మానం ప్రకారం పనులు చేసిన తనకు చెల్లించాల్సిన నిధులను మరో వ్యక్తి పేరుతో చెల్లించారని బంగారు నవీన్ ఆరోపించారు.

గ్రామపంచాయతీ తీర్మానం మేరకు వీధిదీపాల ఏర్పాటు పనులకు తనను నియమించినట్లు నవీన్ తెలిపారు. అయితే నిధుల చెల్లింపు సమయంలో తనకు కాకుండా నార్ల మమత పేరుతో 2026 మార్చి 24న సుమారు రూ.29,916 చెల్లించినట్లు ఆరోపించారు.

తనకు చెందాల్సిన నిధులను మరో వ్యక్తికి చెల్లించడమే కాకుండా, కమిషన్లు తీసుకుని నిధులు మళ్లించారని గ్రామ సెక్రటరీ, సర్పంచ్, ఉప సర్పంచ్‌లపై నవీన్ ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై పెద్దేముల్ మండల పరిషత్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

తన ఫిర్యాదు మేరకు గ్రామపంచాయతీ కార్యదర్శికి అధికారులు మెమో జారీ చేసినట్లు నవీన్ వెల్లడించారు. పని చేసిన వ్యక్తికి కాకుండా మరో వ్యక్తికి చెల్లింపులు జరగడంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.