పులి జాడ కోసం ట్రాప్ కెమెరాల ఏర్పాటు… పులిజాడ దొరికేనా…

వికారాబాద్ జిల్లా…

పులి జాడ కోసం ట్రాప్ కెమెరాల ఏర్పాటు

తాండూర్: తట్టేపల్లి అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుందన్న అనుమానాలతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గత మూడు రోజుల క్రితం ఓ ఆవు దూడను పులి వెంటాడి తిన్నట్లు ప్రచారం జరగడంతో అధికారులు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.

అటవీ ప్రాంతంలో కనిపించిన ఆనవాళ్లు పులివా, చిరుతపులిదా లేదా ఇతర అడవి జంతువుకు సంబంధించినవా అన్నది నిర్ధారించేందుకు అటవీశాఖ అధికారులు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. కెమెరాల ద్వారా జంతువు సంచారాన్ని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు సమీప గ్రామాల ప్రజలకు పలు సూచనలు చేశారు. అటవీ ప్రాంతంలో ఏదైనా అడవి జంతువు కనిపిస్తే దానికి ఎలాంటి హాని చేయకుండా వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలు భయభ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని, పొలాలకు వెళ్లి వచ్చే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.