నెంబర్ వన్ పాఠశాలలో  బడిబాట కార్యక్రమం..

🔴 నెంబర్ వన్ పాఠశాలలో  బడిబాట కార్యక్రమం..

నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ నెంబర్ వన్ పాఠశాలలో శ్రీ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమం ఘనంగా సాగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

ఇందులో భాగంగానే జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలలతో పాటు ప్రీ ప్రైమరీ స్కూల్ లను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం జిల్లాలో 91% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉండడంతో విద్యార్థులకు మంచి బోధన అందుతుందని అన్నారు.

తల్లిదండ్రులు, నాయకుల ప్రోత్సాహంతో వచ్చే ఏడాదిలో 100% ఫలితాలను తేవాలని ఉపాధ్యాయులను కోరారు. ప్రభుత్వం సహకారంతో పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తున్నామని అన్నారు. కొన్ని పాఠశాలలో సమ్మర్ క్యాంపు శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందని విద్యార్థులు వాటిని వినియోగించుకుంటే భాషా ప్రవీణ్యంతోపాటు వివిధ రంగాలలో నిష్ణాతులవుతారని కలెక్టర్ అన్నారు.

తాండూరు నెంబర్ వన్ పాఠశాలలో ఈ ఏడాది మంచి ఫలితాలు రాబట్టేందుకు కృషి చేసిన పాఠశాల ప్రిన్సిపల్ను అదే విధంగా ఉపాధ్యాయులను విద్యార్థులను అభినందించారు. ఇలాంటి బడిబాట కార్యక్రమాన్ని జిల్లాలో కూడా ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు నిర్వహించాలని అన్నారు.

అనంతరం జిల్లాలోనే ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ నెంబర్1 పాఠశాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ అభినందిస్తూ వారికి జ్ఞాపికలను అందజేశారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ నీరజబాల్ రెడ్డి అన్నారు.

నంబర్ వన్ పాఠశాల విద్యార్థులు జిల్లాలోనే టాపర్గా నిలవడం సంతోషం కలిగిందని ఆమె అన్నారు. తల్లిదండ్రులను ఇంకా మోటివేట్ చేసి ఇప్పటినుంచి అడ్మిషన్లు ప్రారంభించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారితో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, కౌన్సిలర్లు, జిల్లా విద్యాధికారి, తాండూర్ డివిజన్ ఆర్డిఓ, ఎమ్మార్వో, ఎంపీడీవో, పాఠశాల ప్రిన్సిపల్ ఏ శివకుమార్, మరియు స్కూల్ మరియు ప్రైమరీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.