మంత్రి శ్రీధర్ బాబు బహిరంగ సభ.

వికారాబాద్ జిల్లా తాండూర్ బల్దియా ఎన్నికలలో భాగంగా అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో జెట్ స్పీడ్ తో దూసుకెళ్తుంది. తాండూర్ బల్దియా ఎన్నికల నేపథ్యంలో తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పాత తాండూర్ నిజాం షాయిద్ దర్గా సమీపంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ పాయింట్ లో ముఖ్య అతిథిగా వికారాబాద్ జిల్లా ఇంచార్జ్, పార్లమెంట్ వ్యవహారాల మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు బహిరంగ సభ పాల్గొని, నిజాం షాయిద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు ముగించుకున్న అనంతరం వరుసగా 13 నుంచి 22,31,32,33 వార్డుల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను, కార్యకర్తలను ఉద్దేశించి బహిరంగ సభలో ప్రసంగిస్తూ… తాండూర్ బల్దియా ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీని నేరుగా ఢీకొనే సత్తా లేక బీజేపీ , టిఆర్ఎస్ పార్టీలు చీకటి ఒప్పందం కుదుర్చుకొని, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దోపిడి ముఠాగా పంచుకుంటున్నారని అన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ ప్రజాపాలనలో నిరుపేదలకు ఆకలి తీర్చేందుకు అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డ్ అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. శాసనసభ ఎన్నికల ముందు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో ప్రాతిపాదికంగా 6 గ్యారంటీలను అంచలంచెలుగా అమలు చేస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందించడం, విద్యుత్ వినియోగదారులకు ఉపశమనంగా 200 యూనిట్ల లోపు వినియోగిస్తే జీరో బిల్ సదుపాయం కల్పిస్తున్నామని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొనసాగించేందుకు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను ఈ నెల 11న జరిగే బల్దియా ఎన్నికల్లో చెయ్యి గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించి, తాండూర్ బల్దియా పై కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు ఆశీర్వదించాలని సభా ప్రాంగణం నుంచి ఓటర్లను ఆకాంక్షించారు. తాండూర్ బల్దియా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి చొరవతో తాండూర్ పట్టణ ప్రగతికి భారీ నిధులు సమకూర్చేందుకు భరోసా ఇస్తున్నానని, మురుగుమయంగా ఉన్న గొల్ల చెరువును మినీ ట్యాంక్ బండ్ గా రూపాంతరం మార్చేందుకు నిధులు కల్పించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.  పాత తాండూర్ లో అత్యధికంగా మైనార్టీల ఓటర్లు ఉండడంతో మంత్రివర్యులు శ్రీధర్ బాబు హిందీలో మాట్లాడడంతో పాటు ఆజా సమయంలో ప్రసంగమును ఆపడంతో మత సమరస్యాన్ని సూచికగా సభ మారింది.ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్, సీనియర్ నాయకులు రహూఫ్, అమీర్ అబ్దుల్లా, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.