నిజాయితీ చాటిన తాండూరు డిపో బస్ కండక్టర్

నిజాయితీ చాటిన తాండూరు డిపో బస్ కండక్టర్

వికారాబాద్ జిల్లా, తాండూర్:

తాండూరు డిపోకు చెందిన తాండూరు–కొత్లాపూర్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఓ మహిళ మరిచిపోయిన పర్సును నిజాయితీగా తిరిగి అప్పగించి తాండూరు డిపో కండక్టర్ ఎన్. రవి అభినందనలు అందుకున్నారు.

బషీరాబాద్ నుంచి తాండూరుకు ప్రయాణించిన ఎక్మయి గ్రామానికి చెందిన శ్రీమతి పుప్పలి శశికళ బస్సులో తన పర్సును మరిచిపోయి దిగిపోయారు. బస్సులో విధులు నిర్వహిస్తున్న కండక్టర్ ఎన్. రవి పర్సును గమనించి వెంటనే తాండూరు డిపో అధికారులకు, భద్రతా సిబ్బందికి అప్పగించారు.

పర్సులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా డిపో అధికారులు ప్రయాణికురాలి ఫోన్ నంబర్‌ను గుర్తించి ఆమెను సంప్రదించారు. అనంతరం సుమారు రూ.5,000 నగదుతో పాటు విలువైన వ్యక్తిగత పత్రాలు ఉన్న పర్సును ఆమెకు సురక్షితంగా అందజేశారు.

తన పోగొట్టుకున్న పర్సు తిరిగి లభించడంతో శ్రీమతి పుప్పలి శశికళ కండక్టర్ ఎన్. రవి, డిపో అధికారులు, భద్రతా సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా తాండూరు డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, కండక్టర్ ఎన్. రవి చూపిన నిజాయితీ, బాధ్యతాయుత సేవాభావాన్ని అభినందించారు. ఇటువంటి సంఘటనలు టీజీఎస్‌ఆర్‌టీసీ సిబ్బంది ప్రజలకు అందిస్తున్న నమ్మకమైన సేవలకు నిదర్శనమని పేర్కొన్నారు.